సుప్రీంకోర్టులో తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. 1991లో ప్రధాని పీవీ నేతృత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడింది. పీవీ, మన్మోహన్‌లు ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎన్నో చట్టాలను సరళీకరించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. కంపెనీ చట్టం, వాణిజ్య పద్ధతుల చట్టం సహా ఎంఆర్‌టీపీ వంటి ఆర్ధిక సంస్కరణలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
ఐడీఆర్ఏ(IDRA)-1951 చట్టం 'లైసెన్స్ రాజ్' రోజులను ప్రతిబింబిస్తోందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శించిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ ఈ మేరకు స్పందించారు. ఈ ఆర్థిక సంస్కరణ వల్ల మార్పులు వచ్చినప్పటికీ.. ఐడీఆర్ఏ మాత్రం అలాగే ఉండిపోయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా, కరోనావైరస్ మహమ్మారి వంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమలను నియంత్రించే అధికారం కేంద్రం కలిగి ఉందని వివరించింది. అయితే, సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రధానిని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.
పీవీ, మన్మోహన్ తెచ్చిన సంస్కరణలు
1991 నాటికి దేశంలో ప్రతీ నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. లైసెన్స్ రాజ్ అనే ఈ విధానాన్ని పీవీ ప్రభుత్వం రద్దు చేసింది.
క్లోజ్డ్ ఎకానమీ ప్లేస్లో ఓపెన్ ఎకానమీ తెచ్చారు. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించి, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించారు.
ఎగుమతులు ప్రోత్సహించారు. దిగుమతుల లైసెన్సింగ్లో నిబంధనలు సడలించారు. విదేశీ పెట్టుబడుల్ని స్వాగతించారు.
సాఫ్ట్వేర్ ఎగుమతి కోసం ఐటీ చట్టం సెక్షన్ 80 హెచ్చీ కింద పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనికి ముందు ఒక కారు, బైక్, ఫోన్ బుక్ చేసినా మన వద్దకు రావాలంటే కొన్నేళ్లు పట్టేది.