PM Modi : నేతలు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదు : మోదీ

Update: 2024-04-16 05:43 GMT

నేతలు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నేటి రాజకీయ నేతల విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతోంది. మన సంస్కృతిలోని ‘ప్రాణం పోయినా మాట తప్పకూడదు’ అన్న నీతిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేతలు వారు ఇచ్చిన హామీ పట్ల బాధ్యత తీసుకోవాలి. నిలబెట్టుకోవాలి. మేం మాటిస్తే పాటిస్తాం. 370వ అధికరణ రద్దే మా నిబద్ధతకు నిదర్శనం’ అని మోదీ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్నికల్లో పార్టీలు డబ్బును ఖర్చు చేసే మాట నిజం. ఇందులో నల్లధనానికి చోటు లేకుండా పారదర్శకత తేవాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ స్కీమ్. ఇది రద్దు కావడంతో దేశాన్ని మళ్లీ నల్లధనంవైపు నెట్టేసినట్లు అయింది. దీని పరిణామాలు గురించి తెలుసుకున్నాక అందరూ చింతిస్తారు’ అని పేర్కొన్నారు.

మరోవైపు బీజేపీ 400కుపైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. తమ పార్టీ అజెండాపై ప్రతిపక్షాలు ప్రజలను భయబ్రాంతులను గురిచేయడం మానుకోవాలని సూచించారు. ‘నేను పెద్ద ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టాలని నిర్ణయం తీసుకోను. దేశ అభివృద్ధి గురించి ఆలోచించే తీసుకుంటా’ అని తెలిపారు.

Tags:    

Similar News