NDA పార్లమెంటరీ నేతగా ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు బీజేపీ దిగ్గజ నేతలను కలిశారు. భారతరత్న అవార్డు గ్రహీత LK అడ్వాణీ ఇంటికి వెళ్లి ఆయనకు పుష్పం గుచ్చం ఇచ్చారు. అడ్వాణీతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి మరో దిగ్గజ నేత మురళీ మనోహార్ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధానికి సాదర స్వాగతం పలికిన జోషి శాలువు కప్పి సత్కరించారు. తర్వాత ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు.
తొమ్మిదిన ప్రమాణం
కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో సాయంత్రం ఆరుగంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఉదయం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఎన్డీయే ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీతోపాటు ఎన్డీయేపక్ష నేతలు చంద్రబాబు, నీతీశ్ కుమార్, ఏక్‌నాథ్‌శిందే, అజిత్ పవార్, జయంత్ చౌదరీ, చిరాగ్ పసవాన్, కుమార స్వామి తదితరులు బలపరిచారు. ఈ తీర్మానానికి ఎన్డీయే ఎంపీలంతా లాంఛనంగా ఆమోదం తెలిపారు. లోక్‌సభలో ఎన్డీయే పార్లమెంటు పార్టీ నేతగా, భాజపాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్రమోదీకి చంద్రబాబు, నీతీశ్‌కుమార్‌సహా ఎన్డీయే నేతలు అభినందనలు తెలిపారు.
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన మోదీ లోక్‌సభా పక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీయే పక్ష నేతలు, క్షేత్రస్థాయిలో పనిచేసిన కోట్లాది మంది పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్డీయే అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ అన్నారు. ఇప్పటికే తమ కూటమి విజయవంతంగా మూడు పర్యాయాలు పూర్తి చేసుకుని నాలుగో పర్యాయంలోకి అడుగుపెడుతోందన్నారు. చరిత్రలో అంకెల ప్రాతిపదికన ఇప్పటివరకు ఏర్పడిన కూటములను చూస్తే...... ఎన్డీయేనే శక్తిమంతమైందని మోదీ చెప్పారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్నినిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశం ముందు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి తమదని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో సుపరిపాలన, అభివృద్ధి, పౌరుల జీవితాల్లో తక్కువ జోక్యమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని, అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి NDA కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించినా విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని మోదీ విమర్శించారు. తాము ఓడిపోయామని చిత్రీకరించాలని చూశాయనీ.. కానీ తమకు ఓటమి లేదని దేశప్రజలకు తెలుసన్నారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో భాజపా సాధించిన సీట్ల కంటే తక్కువని తెలిపారు. మరో పదేళ్లయినా కాంగ్రెస్ 100 స్థానాల మార్క్‌ను దాటలేదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు EVMలపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారనీ,ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలైనట్లు ప్రధాని తెలిపారు. పార్లమెంటులో అన్ని అంశాలపై...... సమగ్ర చర్చలకు సహకరించడం ద్వారా... ప్రతిపక్ష ఎంపీలు దేశ నిర్మాణానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్టు మోదీ అన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదిముర్మును కలిశారు. ఆయనతోపాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్ తదితర నేతలు రాష్ట్రపతిని కలిశారు.ఎన్డీయేకు చెందిన ఎంపీలు తమ పార్లమెంటరీ పార్టీ నేతగా..... నరేంద్రమోదీని ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.