దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ;
దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని రుతు పవనాలు తాకాయని వాతావరణ శాఖ తెలిపింది. అంచనా వేసిన దానికంటే రెండు రోజుల ముందే దిల్లీ, ముంబయికి రుతు పవనాలు విస్తరించాయని ఇది చాలా అరుదైన విషయమని వివరించింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు రుతు పవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలకు.. హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించినట్లు తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నా నైరుతి రుతు పవనాల సీజన్‌లో భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD వెల్లడించింది. రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రుతు పవనాల ప్రభావంతో దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలుహిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా జూన్ 26 వరకు ఆరెంజ్ అలర్ట్.. జూన్ 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్‌లో వచ్చే వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలోని చాలా జిల్లాల్లో వర్షం ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. వచ్చే వారం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.