Karnataka Caste Survey: కులసర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణమూర్తి దంపతులు
సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి ప్రత్యేకంగా సెల్ఫ్ డిక్లరేషన్
రాజ్యసభ సభ్యురాలు, దానశీలి సుధా మూర్తి .. కర్నాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కులసర్వే(Karnataka Caste Survey)లో పాల్గొనేందుకు నిరాకరించారు. సుధా మూర్తి భర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఆ సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. తామేమీ వెనుకబడిన వర్గానికి చెందినవాళ్లము కాదు అని, అందుకే సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి తెలిపారు. సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి ప్రత్యేకంగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించారు. తమ సర్వే రిపోర్టుతో ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కూడా కులసర్వేలో పాల్గొనడం లేదని ఆమె తెలిపారు. కర్నాటక ప్రభుత్వానికి చెందిన వెనుకబడిన తరగతుల కమీషన్.. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే పేరుతో కుల సర్వేను నిర్వహిస్తున్నది.
సుధా మూర్తి నిర్ణయం పట్ల కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సర్వేలో పాల్గొనాలని ఎవర్నీ వత్తిడి చేయడం లేదని, స్వచ్ఛందంగా ఆ సర్వేలో పాల్గొనాలని ఆయన అన్నారు. కర్నాటక హైకోర్టు సెప్టెంబర్ 25వ తేదీన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆప్షనల్‌గా సర్వే చేపట్టనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి కుల సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే కోసం ప్రభుత్వం 420 కోట్లు ఖర్చు చేస్తున్నది. సర్వేలో భాగంగా 60 ప్రశ్నలు వేయనున్నారు. అక్టోబర్ 19వ తేదీ లోపు సర్వే పూర్తి చేయాల్సి ఉంది. బీసీ కమీషన్ డిసెంబర్‌లో ప్రభుత్వానికి రిపోర్టును అందజేస్తుంది.