Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ..ఎన్నిక ఏకగ్రీవం

బిహార్‌లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం

Update: 2026-01-20 02:00 GMT

కమల దళపతిగా 45 ఏళ్ల నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ చరిత్రలో ఇంత చిన్న వయసులో జాతీయ అధ్యక్షుడి స్థాయికి చేరిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాయస్థ సామాజికవర్గానికి చెందిన ఆయన ఆరెస్సెస్‌ నేపథ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల బిహార్‌ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గత నెల 14న నియమితులైనప్పుడే పార్టీ పగ్గాలు జేపీ నడ్డా నుంచి ఆయనకు రావడం ఖాయమని స్పష్టమైంది. దానికి తగ్గట్టుగా సోమవారం నితిన్‌ నబీన్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన్ని ప్రతిపాదించినవారిలో ప్రధాని నరేంద్రమోదీ ఒకరు. నితిన్‌ తరఫున పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, కిరణ్‌ రిజిజు, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులు తొలి సెట్‌ పత్రాలను జాతీయ రిటర్నింగ్‌ అధికారి, ఎంపీ కె.లక్ష్మణ్‌కు సోమవారం అందజేశారు. భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు పెమా ఖండూ, యోగి ఆదిత్యనాథ్, పుష్కర్‌సింగ్‌ ధామీ, నాయబ్‌సింగ్‌ సైనీ, ప్రమోద్‌ సావంత్‌లు మరో సెట్‌ సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, అస్సాం, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా నబీన్‌కు మద్దతుగా నామినేషన్లు అందజేశారు. మొత్తం 37 సెట్ల నామినేషన్లు ఆయన తరఫున దాఖలు కాగా అవన్నీ సక్రమంగా ఉన్నట్లు లక్ష్మణ్‌ ప్రకటించారు. విజయవంతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుత ప్రక్రియలో ఎన్నిక పూర్తికావడం.. అంతర్గత ప్రజాస్వామ్యంపై పార్టీకి ఉన్న నమ్మకాన్ని చాటుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జె.పి.నడ్డా నుంచి నితిన్‌ మంగళవారం బాధ్యతలు చేపడతారు.

పార్టీ పుట్టినప్పుడు జన్మించిన నేత

నితిన్‌ నబీన్‌ భాజపా పుట్టిన సంవత్సరం(1980)లో రాంచీలో జన్మించి, ఇప్పుడు అదే పార్టీకి సారథ్యం వహించబోతున్నారు. తండ్రి, భాజపా ఎమ్మెల్యే నబీన్‌ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా మరణించాక 2006లో ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ ఏడాది ఉప ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా నెగ్గారు. వివిధ శాఖలకు మంత్రిగా చేశారు. యువమోర్చా నుంచి వచ్చి, ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన ఆయన 2023లో ఛత్తీస్‌గఢ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కీలకపాత్ర పోషించారు. ఆ ఏడాది ఆ రాష్ట్రంలో భాజపా సాధించిన గెలుపుతో కేంద్ర నాయకత్వం వద్ద గుర్తింపు పొందారు. ఉమ్మడి బిహార్‌ నుంచి పార్టీ అధ్యక్ష స్థాయికి చేరిన తొలినేతగా ఇప్పుడాయన నిలుస్తారు. ఏప్రిల్‌లో తమిళనాడు, కేరళ, అస్సాంలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు తొలిపరీక్ష కానున్నాయి. 

Tags:    

Similar News