WAR: "అపరేషన్ సిందూర్"... ఇంకా ఉంది

అబీ పిక్చర్ బాకీ హై అన్న రక్షణమంత్రి ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని స్పష్టీకరణ;

Update: 2025-05-09 06:00 GMT

పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పటికీ కొనసాగుతోందని, సరిహద్దు వద్ద పరిస్థితి వేగంగా మారుతోందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్ వివరాలను అఖిలపక్షానికి రక్షణమంత్రి వివరించారు. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ తోపాటు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మిథున్ రెడ్డి సహా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పొరుగు దేశంతో కొనసాగుతున్న వివాదం గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌, భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలను వివరించింది. ‘‘తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేం. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం మాకు లేదు. పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం.. వెనక్కి తగ్గేదే లేదు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుంది’’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు భేష్: కిరణ్‌ రిజిజు

‘‘ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణమంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే, ఇది కొనసాగుతున్న ఆపరేషన్‌ గనుక.. సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదు’’ అని రిజిజు వెల్లడించారు. "ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు, ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి అందరికీ వివరించారు. అలాగే అందరు నాయకులు తమ సూచనలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. అని వివరించారు. ఆపరేషన్ సిందూర్ కోసం అందరూ సాయుధ దళాలను ప్రశంసించడం తో పాటు అభినందించారు.

ఐక్యంగా నిలబడుతాం: రాహుల్‌

‘‘ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నాం. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కొనసాగుతోందని రాజ్‌నాథ్‌ చెప్పారు’’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు.

ఒవైసీ కీలక వ్యాఖ్యలు

అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలను, ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా సూచించినట్లు తెలిపారు.. రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే విధంగా.. భారత ప్రభుత్వం.. అమెరికాను ని అభ్యర్థించాలని కూడా ఒవైసీ సూచించారు. ఎఫ్ఏటీఎఫ్‌లో పాకిస్తాన్‌ను గ్రే-లిస్ట్ చేయడానికి కూడా భారత్ ప్రయత్నం చేయాలని సూచించారు.

రాజ్‌నాథ్ వ్యాఖ్యలను గౌరవించాం: ఖర్గే

భద్రతకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది తాము విన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. దేశభద్రతకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించలేమని రక్షణ మంత్రి తెలిపారని అన్నారు. ఆ విషయాన్ని తాము గౌరవించామని ఖర్గే వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పామని.. తెలిపారు. అఖిల పక్షానికి ప్రధాని రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఖర్గే.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎవరిని విమర్శించడం లేదన్నారు.

ప్రధానితో హోంశాఖ కార్యదర్శి భేటీ

ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ అయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపై వీరు చర్చించారు.పాకిస్థాన్ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందారు.

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

ఆపరేషన్ సింధూర్ అనంతరం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఫేక్ పోస్టులను ప్రచారం చేసే ఖాతాలను బ్లాక్ చేయాలని సూచించారు. కాగా.. భారత్, పాక్‌పై చేసిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. భారత్ దాడుల తీవ్రత పెంచిన దేశంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. భద్రతా దళాల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News