భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి. దీంతో ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోనాస్ ,బైడూస్ నేవిగేషన్ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకొంటుంది. దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్‌లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది.
2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నేవిగేషన్ సిగ్నల్స్‌ను జామ్ చేయగలవు.
పాకిస్థాన్ లో సొంతంగా తయారుచేసుకొన్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ, చైనా నుంచి దిగుమతి చేసుకొన్న డీడబ్ల్యూఎల్-002, జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితోపాటు కమర్షియల్ జామర్లను పాక్ వాడుతోంది. భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నేవిగేషన్‌తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.