PAN Aadhaar Link : 6 రోజులే మిగిలాయి.. ఆధార్-పాన్ కథ కంచికేనా? లేదంటే మీ జేబుకు చిల్లేనా?
PAN Aadhaar Link : ఈ ఏడాది ముగియడానికి మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ఏడాది సంబరాల్లో మునిగిపోయే ముందు, మీరు పూర్తి చేయాల్సిన అతి ముఖ్యమైన ఆర్థిక పని ఒకటి ఉంది. అదే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం. ఒకవేళ మీరు ఈ పనిని డిసెంబర్ 31లోపు పూర్తి చేయకపోతే, మీ పాన్ కార్డు కేవలం ఒక పనికిరాని కాగితం ముక్కలా మారిపోతుంది. దీనివల్ల ఆర్థికంగానే కాకుండా, మీ రోజువారీ బ్యాంకింగ్ పనుల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఈ గడువు గురించి అనేకసార్లు హెచ్చరించింది.
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఆఖరి గడువు డిసెంబర్ 31, 2025. ఈ గడువు దాటిన తర్వాత మీ పాన్ కార్డు ఇన్ యాక్టివ్ గా అవుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంటే, ఆ కార్డు సిస్టమ్‌లో పనిచేయదు. ఇప్పటికే గడువు ముగిసినందున, ఇప్పుడు లింక్ చేయాలనుకునే వారు రూ. 1,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1, 2024 తర్వాత కొత్త పాన్ కార్డు తీసుకున్న వారు కూడా ఈ నెల ఆఖరులోపు లింక్ ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి.
మీ పాన్ కార్డు గనుక చెల్లకుండా పోతే, మీ ఆర్థిక లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో కొత్త అకౌంట్లు తెరవడం సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే కేవైసీ కోసం పాన్ కార్డు తప్పనిసరి. కార్డు పనిచేయకపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్లు అన్నీ హోల్డ్‌లో పడిపోతాయి. అలాగే, బ్యాంకుల్లో ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు తీసుకోవడం లేదా వాటిని రీన్యూ చేసుకోవడం కూడా అసాధ్యం అవుతుంది.
పాన్-ఆధార్ లింక్ చేయని వారికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ మీకు రావాల్సిన పాత ట్యాక్స్ రీఫండ్స్ ఏవైనా ఉంటే, అవి కూడా నిలిచిపోతాయి. అంతేకాకుండా, పాన్ కార్డు యాక్టివ్‌గా లేకపోతే మీ ఆదాయంపై కోత విధించే టీడీఎస్ సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఫామ్ 26AS చూడటం లేదా టీడీఎస్ సర్టిఫికెట్లు పొందడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ ఆర్థిక స్వేచ్ఛ మొత్తం లాక్ అయిపోతుంది. అందుకే ఆఖరి నిమిషం దాకా ఆగకుండా, వెంటనే రూ.1000 జరిమానా కట్టి లింక్ చేసుకోవడం ఉత్తమం.