PM Modi: ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం..
ఇప్పటి వరకు మోడీని సత్కరించిన 27 దేశాలు..;
ప్రధాని నరేంద్రమోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రధానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా మోడీకి ఈ పురస్కారాన్ని అందించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి దేశమైన నమీబియాలో ప్రధాని పర్యటిస్తున్నారు.
పీఎం మోడీ ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. నమీబియాను సందర్శించిన భారత ప్రధానుల్లో మూడో వ్యక్తి. ప్రధానిగా 2014లో మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు 27 దేశాలు అత్యున్నత గౌరవంతో సత్కరించాయి. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇంధనం, ఆరోగ్య సంరక్షణ సహా అనేక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
నమీబియా అవార్డుపై పీఎం మోడీ మాట్లాడుతూ.. ‘‘వెల్విట్చియా మిరాబిలిస్‌తో సత్కరించడం నాకు చాలా గర్వకారణం, నమీబియా ప్రభుత్వం మరియు నమీబియా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా అంగీకరిస్తున్నాను’’ అని అన్నారు.