Vijay Diwas : విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు
పాక్ కుటిల ప్రయత్నాలకు చెక్‌పెట్టి 22 ఏళ్లు;
1971 పాకిస్థాన్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతీ ఏటా డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ , రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
ఆనాటి యుద్ధంలో సైనికుల ధైర్య సాహసాలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పలువురు ప్రముఖులు 1971 యుద్ధంలో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుని,అమర సైనికులకు అంజలి ఘటించారు. 1971 యుద్ధంలో మన సాయుధ బలగాలు చేసిన నిస్వార్థ త్యాగాన్ని దేశం స్మరించుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన వీర సైనికులకు ఆమె అంజలి ఘటించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో వీర మరణం పొందిన సైనికులకు ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ నివాళులు అర్పించారు. సైనికుల త్యాగం పరాక్రమం చిరస్మరణీయమని అన్నారు. 1971 యద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ..వారి త్యాగాలు దేశ చరిత్రలో నిలిచి ఉంటాయన్నారు. విజయ్ దివస్ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్... జాతీయ యుద్ధ స్మారకం వద్ద అంజలి ఘటించారు. CDS జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కూడా వీర సైనికులకు నివాళులు అర్పించారు . కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు