వయనాడ్, రాయ్‌బరేలి నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ ( Rahul Gandhi ).. వయనాడ్ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘మా ప్రియమైన పెద్దన్న రాహుల్ గాంధీ. మమ్మల్ని వదిలి వెళ్లకండి. కచ్చితంగా వెళ్లాల్సి వస్తే.. మీ సోదరి ప్రియాంకాగాంధీని మమ్మల్ని చూసుకోమని చెప్పండి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi ) వయనాడ్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారని సమాచారం. దీంతో ఈ స్థానం నుంచి ప్రియాంకా రాజకీయ అరంగేట్రం చేయనున్నారని టాక్. కాగా గతంలో కూడా ఆమె ప్రధాని మోదీపై వారణాసిలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోనియా గాంధీ వదులుకున్న రాయ్‌బరేలీ నుంచి కూడా ఆమె పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు.
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారన్న వార్తలు 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తరువాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆ తరువాత తాను నోరు జారానంటూ వివరణ ఇచ్చారు.