కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు నిలిపివేశారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు న్యాయ్ యాత్రకు విరామం ఉంటుందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తెలిపారు.
ఈ సమయంలో రాహుల్ గాంధీ రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమావేశాలను ఢిల్లీలో నిర్వహించనున్నారు.
దీంతో పాటు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. రాహుల్ అక్కడ రెండు ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. యాత్రను మార్చి 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ధోల్‌పూర్‌లో తిరిగి పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. మార్చి5న మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు.
కేంద్రహోంమంత్రి అమిత్ షాపై (Amit Shah ) అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం నాటి ఈ కేసులో యూపీలోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేళ.. అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్ర ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.