జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులు జరిపిన ఉగ్రవాది ఉహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేస్తున్నారు. హీరానగర్ లో జరిపిన కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడు.
ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తోన్న బస్సుపై పాకిస్థాన్ లక్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్) ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. డ్రైవర్‌కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ (40), అతని 19 ఏళ్ల కండక్టర్ అరుణ్ కుమార్ మరణించారు. ఆ ఇద్దరి మరణంపై బస్సు యజమాని స్పందించారు. విజయ్ కుమార్, అరుణ్ కుమార్‌లను అమరవీరులుగా గుర్తించాలని కోరారు యజమాని సుజన్ సింగ్.
బాధితుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50,000 ఎక్స్ గ్రేషియాను జమ్ముకశ్మీర్ అధికారులు ప్రకటించారు.