ముంబైను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండటంతో వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 మిమీ వర్షపాతం రావడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి చెరువుల్ని తలపిస్తున్నాయి. జనజీనవం అస్తవ్యస్తమైంది. 50వరకు విమానాల్ని రద్దు చేశారు. రైళ్ల రాకపోకలూ స్తంభించాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
మరోవైపు అస్సాంలో భారీ వర్షాల ధాటికి వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల్లో తాజాగా మరో ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 72కి చేరింది. మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. కజిరంగ నేషనల్ పార్కులో దాదాపు 131 జంతువులు మృత్యువాత పడ్డాయి. కాగా ఆ రాష్ట్రంలో సహాయక చర్యలను సీఎం హిమంత బిశ్వశర్మ పర్యవేక్షిస్తున్నారు.