ఇండియాలో భారీగా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ 6 సోమవారం ఒక్కరోజే ఐదు కేసులు బయటపడగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. నిన్న బెంగళూరులో రెండు, చెన్నైలో రెండు, అహ్మదాబాద్‌లో ఒక కేసు నమోదవగా తాజాగా మహారాష్ట్రలో రెండు కేసులు బయటపడ్డాయి. నాగ్‌పూర్‌లో ఇద్దరు చిన్నారులకు వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 7ఏళ్లు, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు వివరించారు.
కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ వైరస్ సోకినవారు తుమ్మినా.. దగ్గినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్ల పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపనుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3 నుంచి ఆరు రోజుల తర్వాత లక్షణాలు అంటే జబ్బు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.