ISRO: ఇస్రో రాకెట్ ప్రయోగం విఫలం
రెండు దశల పాటు సాఫీగా సాగిన రాకెట్ ప్రయాణం, మూడో దశలో అంతరాయం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. తొలి రెండు దశల్లో సాఫీగా సాగిన రాకెట్.. మూడో దశలో గతి తప్పింది. ఈ రోజు ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ– సీ62 రాకెట్ నింగికెగిరింది. 18 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాలి. అయితే, సాంకేతిక సమస్య వల్ల రాకెట్ తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్-ఎన్1’ లేదా ‘అన్వేష’ ఉపగ్రహంతో పాటు భారత్, యూకే, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. అత్యంత కీలకమైన ‘అన్వేష’ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, 2025 మే 18న ప్రయోగించిన పీఎఎస్ఎల్వీ – సీ61 రాకెట్ ప్రయోగం కూడా ఇదేవిధంగా మూడో దశలోనే విఫలమైంది. ఈ ప్రయోగంలో జరిగిన తప్పొప్పులను నిశితంగా పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దుకున్నాక చేపట్టిన తాజా ప్రయోగం కూడా ఫెయిలైంది.