ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. 12 మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గరియాబంద్ ఎస్పీ తెలిపారు. నిన్న గరియాబంద్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు కూంబింగ్ నిర్వహించాయని, తమ సిబ్బందిలో ఒకరు కాల్పుల్లో గాయపడ్డారని పేర్కొన్నారు.