Tamil Nadu : విరుచుకుపడ్డ తుఫాను, వాయుగుండం.. వర్షాలతో తమిళనాడులో వరుస సెలవులు
అతి భారీవర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం, తుఫానులు ఆ రాష్ట్రంలోని తీరప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటితో అన్ని ప్రాంతాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది గత రాత్రికి వాయుగుండంగా మారి.. శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకొచ్చింది. దీంతో తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్ర రాజధాని చెన్నైలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు, రహదారులు నీటిలో మునిగిపోయాయి. అలాగే మరో 24 గంటల పాటు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. ఇటు అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.