Stampede at Kumbh Mela : తొక్కిసలాట: మళ్లీ యోగీకి మోదీ, అమిత్ షాలు ఫోన్

Update: 2025-01-29 13:15 GMT

ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమం వద్ద తొక్కిసలాటపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఫోన్ చేశారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. పరిస్థితులను సమీక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరారు. అంతకు ముందు తొక్కిసలాట జరిగిందని తెలియగానే మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో 13 అఖాడాల సాధువులు నేడు పవిత్ర స్నానాలను వాయిదా వేసుకున్నారు.

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరాతీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు ఇబ్బంది పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రివేణి సంగమం వద్ద ఓ ఘాట్లో రాత్రి 2 గంటలకు అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి తొక్కిసలాట జరిగి పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్‌లో ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News