భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్‌లో కూడా ప్రసారాలు అందుబాటులో లేవు.
జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ ఖాతాను భారత్‌లో నిలిపివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది...తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దోడాలోని పలు నివాసాల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టింది.