Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్ నుంచి పడిపోయిన ప్రయాణికులు.. ఇద్దరు మృతి
పండగ వేళ విషాదం..
పండగవేళ విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బీహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో ముగ్గురు ప్రయాణికులు రైలు నుండి పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నాసిక్ రోడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూసావల్ వెళ్లే ట్రాక్‌లోని 190/1, 190/3 కిలోమీటరు మధ్య ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఇద్దరు వ్యక్తులు 30, 35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అంచనా. మూడవ ప్రయాణీకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు ప్రయాణికులు ఎవరనేది ఇంకా గుర్తించలేదు.
పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు రైలు నుండి పడిపోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఓధా రైల్వే స్టేషన్ మేనేజర్ ఆకాష్ పోలీసులకు సమాచారం అందించారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర సప్కలే, సబ్-ఇన్‌స్పెక్టర్ మాలి, కానిస్టేబుల్ భోలే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు బృందం పంచనామా తయారు చేసి మృతదేహాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించింది.