Madhya Pradesh News: ఇంటెలిజెన్స్ ఐజీ ఫోన్ కాజేసి.. ఏం చేశారంటే
ఐటీ మార్నింగ్ వాక్ చేస్తుండగా సెల్ ఫోన్లు అపహరించిన యువకులు
మధ్యప్రదేశ్‌లో అత్యంత పటిష్ఠ భద్రత కలిగిన ప్రాంతంగా పేరుగాంచిన భోపాల్‌లోని చార్ ఇమ్లీ ప్రాంతంలో ఒక పోలీస్ ఉన్నతాధికారికే ఊహించని అనుభవం ఎదురైంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఐజీ డా. ఆశీశ్, తన భార్యతో కలిసి ఉదయం నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు చెందిన రెండు మొబైల్ ఫోన్లను అపహరించి పరారయ్యారు.
ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. చార్ ఇమ్లీ ప్రాంతం ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు నివసించే ప్రాంతం కావడంతో భద్రత పరంగా అత్యంత కీలకమైనది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, పాత నేరస్థుల నుంచి సమాచారం సేకరించారు. సైబర్ ట్రాకింగ్ ద్వారా నిందితుల చివరి లొకేషన్ దుర్గానగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిలో ఒకరిని ఆదిత్య గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు మైనర్లు. దొంగిలించిన ఫోన్లలో ఒకదాన్ని సంఘటన స్థలానికి సమీపంలోనూ, మరొకదాన్ని ఓ పార్కులో స్విచ్ఛాఫ్ చేసి పాతిపెట్టిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.