Chhattisgarh : పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
గడ్చిరోలిలో గర్జించిన తుపాకులు;
మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో తుపాకులుమారుమోగాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బోధిన్‌తులా వద్ద మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. ఈ ప్రాంతం గడ్చిరోలి ఔట్‌పోస్టుకు సమీపంలో ఉంది. దీంతో గడ్చిరోలి ఔట్‌పోస్టును పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత క్యాంపును రౌండప్ చేసే సమయంలో పోలీసుల కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. దీంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల మోతతో గడ్చిరోలి దద్దరిల్లి పోయింది.
ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతమయ్యారు. అందులో ఒకరిని కసన్‌సూర్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టిగా పోలీసులు గుర్తించారు. మరో మావోయిస్టు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి ఏకే 47 రైఫిల్, ఎస్ఎల్ఆర్‌తో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దుర్గేశ్.. 2019లో జంబుల్‌ఖేడ వద్ద జరిపిన పేలుళ్లలో కీలక పాత్ర పోషించారు. ఆ పేలుళ్ల ధాటికి 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.