తోడేళ్లు కనిపిస్తే షూట్ చేయండి.. ఫారెస్ట్ ఆఫీసర్లకు యూపీ సీఎం యోగి ఆదేశాలు

Update: 2024-09-04 06:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్​ జిల్లాను తోడేళ్లు వణికిస్తున్నాయి. కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్‌ భేడియా’ చేపట్టినా..దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కన్పిస్తే కాల్చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు తిరుగుతోందని గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు.. ‘ఆపరేషన్‌ భేడియా’లో భాగంగా ఇప్పటివరకు నాలుగింటిని పట్టుకున్నారు. మిగతా రెండింటిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం చిక్కట్లేదు. మరోవైపు.. తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి కూడా ఐదేళ్ల పాపపై దాడి చేసి గాయపర్చింది. ఇప్పటివరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా.. దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు.

మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ‘ఆపరేషన్‌ భేడియా’పై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుతుండటంతో పట్టుకోవడం సవాల్‌గా మారుతోందని వివరించారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన టైమ్ లో వాటిని గన్ తో కాల్చేయాలని ఆదేశించారు. అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. బహ్రాయిచ్ జిల్లా కలెక్టర్‌ రాణి మాట్లాడుతూ.. ‘ప్రతి నాలుగైదు రోజులకొకసారి తోడేళ్లు కొత్త గ్రామంపై దాడి చేస్తున్నాయి. దీంతో వాటి దాడులను అంచనా వేయడం సవాల్ గా మారుతోంది. పరిస్థితిపై ఇప్పటికే ప్రజలకు సమాచారమిచ్చాం. రాత్రివేళల్లో తలుపులన్నీ మూసివేసి ఇంట్లోనే నిద్రపోవాలని సూచించాం. డ్రోన్లతో తోడేళ్ల కదలికలను తెలుసుకుంటున్నాం’అని వివరించారు.

Tags:    

Similar News