VBSA: వికసిత్ భారత్ దిశగా వీబీఎస్ఏ బిల్లు
వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA ) బిల్లుతో విద్యా రంగంలో సంస్కరణలు...2047 వికసిత్ భారత్ లక్ష్యానికి విద్యే పునాది.. డిగ్రీలకే కాదు నైపుణ్యాలకు ప్రాధాన్యం
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దాలనే లక్ష్యంలో విద్యారంగం కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు, 2025' దేశ విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుగా కనిపిస్తోంది. కేవలం డిగ్రీల ప్రదానం కంటే, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం , సార్వత్రిక విద్యను (Open Schooling) అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రధాన లోపం ఏమిటంటే.. విద్యార్థులు పట్టాలు పొందుతున్నారు కానీ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు వారిలో ఉండటం లేదు. VBSA బిల్లు ద్వారా సాంకేతిక విద్యా ప్రమాణాలను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై సాంకేతిక విద్య కేవలం థియరీకి పరిమితం కాకుండా, ఉపాధి ,వ్యవస్థాపకత లక్ష్యంగా సాగాలి. అంటే, చదువు పూర్తి చేసిన వెంటనే ఒక విద్యార్థి ఉద్యోగానికి సిద్ధంగా ఉండాలి లేదా తనే ఒక స్టార్టప్‌ను ప్రారంభించేలా శిక్షణ పొందాలి. ఇది దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాకుండా, యువతను 'జాబ్ సీకర్స్' నుండి 'జాబ్ క్రియేటర్స్'గా మారుస్తుంది.
బోధనలో AI విప్లవం
నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం లేని రంగం లేదు. విద్యా రంగంలో దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఉపాధ్యాయ విద్యలో AIని ఒక భాగంగా చేర్చడం ద్వారా, బోధనా పద్ధతుల్లో పారదర్శకత, వ్యక్తిగతీకరించిన అభ్యాసం సాధ్యమవుతాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) విధులను VBSA పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఉపాధ్యాయుల శిక్షణా ప్రమాణాల్లో గుణాత్మక మార్పులు రానున్నాయి.
డ్రాపౌట్స్ కట్టడికి మార్గం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) వ్యవస్థలో తీసుకురానున్న మార్పులు సామాజికంగా ఎంతో ప్రాధాన్యత కలిగినవి. ప్రస్తుతం కేవలం పాఠశాలలతో అనుసంధానమైన సంస్థలే ఓపెన్ స్కూలింగ్ అందించే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం, ఐటిఐ వంటి సాంకేతిక సంస్థలు కూడా ఓపెన్ స్కూలింగ్ కోర్సులను నిర్వహించవచ్చు. దీనివల్ల వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు , వృత్తి విద్యా నైపుణ్యాలతో పాటు తమ సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యను కూడా పూర్తి చేయవచ్చు. ఇది దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే కాకుండా, శ్రామిక శక్తికి విద్యా అర్హతలను కల్పిస్తుంది. ఏదైనా పెద్ద మార్పు వచ్చినప్పుడు అభ్యంతరాలు రావడం సహజం. ఈ బిల్లుపై ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అయితే, రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉంది. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవాలంటే మన విద్యార్థులకు ఆధునిక సాంకేతికత, సరళమైన విద్యా విధానం మరియు ఉపాధి గ్యారంటీ అవసరం. ఈ దిశగా VBSA బిల్లు సకాలంలో ఆమోదం పొంది అమల్లోకి వస్తే, భారత విద్యా వ్యవస్థ ప్రపంచ స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు.