Delhi Floods: ఉప్పొంగుతున్న యమున

అల్లకల్లోలంగా మారిన ఢిల్లీ, జలదిగ్భంధనంలో ఎర్రకోట

Update: 2023-07-14 05:00 GMT

యమునా నది ఉధృతికి దేశ రాజధాని నగరం ఢిల్లీ అల్లాడిపోతోంది. రాజధాని నగరంలో ఠీవిగా నిలిచే ఎర్రకోటను కూడా వరద ముప్పు ముంచేసింది. వర్షాలు భారీగా లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో యమునా నదిలో నీటి మట్టం ఆల్‌టైం రికార్డుకు చేరుకుంది.

వరద నీటి కారణంగా ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వీధులకు, నదులకు తేడా లేకుండా పోయింది. వరద నీరు ఎర్ర కోటను తాకడం తో కూడా రెడ్ ఫోర్ట్ చుట్టూ ఉన్న రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరద నీటితో నిండిపోయాయి. కనుచూపు మేర నీరు తప్ప రోడ్డు కనిపించని దుస్థితి నెలకొంది.


ఇక, యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ఉంది. 1978లో ఈ నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కాలేజీలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు.




 రాజధాని ఢిల్లీలోకి యుమునా నది చొచ్చుకొచ్చేసింది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టి యమునా నది చరిత్రలోనే అత్యధిక వరద నమోదైంది. 1978లో అత్యధికంగా 207.49 మీటర్ల వరద నమోదైంది. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక వరద. ఇప్పుడు అంతకుమించి 208.66 మీటర్లు దాటి వరద ప్రవహిస్తోంది. అందుకే యమునా నది ఢిల్లీ నగరంలోకి దూసుకొచ్చింది. భారీ వర్షాలకు తోడు హర్యానా నుంచి వచ్చిన వరద నీరు తోడవడంతో యుమనా నది ఉప్పొంగింది. ఢిల్లీలోని రోడ్లు, వీధులు నదుల్ని తలపిస్తున్నాయి. వరద గుప్పిట్లో చిక్కుకుపోవడంతో ఢిల్లీ నగరానికి మంచి నీటి సరఫరా చేసే మూడు ప్రదాన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు మూతపడ్డాయి. దాంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోంది.

Similar News