Sunita Kejriwal : భర్తకు మద్దతుగా వాట్సాప్ డ్రైవ్‌ లాంఛ్ చేసిన సునీతా కేజ్రీవాల్

Update: 2024-03-29 08:25 GMT

జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భార్య సునీతా కేజ్రీవాల్ (Sunitha Kejrriwal) శుక్రవారం (మార్చి 29) వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "మేము ఈ రోజు నుండి డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నాము. మీరు ఈ నంబర్‌లో కేజ్రీవాల్‌కు మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలను పంపవచ్చు" అని ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

తన భర్త దేశభక్తుడు, ధైర్యవంతుడని ఆమె పేర్కొన్నారు. "నా భర్త నిజమైన దేశభక్తుడు. అతను కోర్టులో తన స్టాండ్‌ను ప్రదర్శించే విధానానికి చాలా ధైర్యం కావాలి" అని సునీతా కేజ్రీవాల్ వీడియోలో పేర్కొన్నారు. ఇకపోతే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత వారం అరెస్టు చేసినప్పటి నుంచి లాకప్‌లోనే ఉన్నారు.

కేజ్రీవాల్ కస్టడీని పొడిగించిన కోర్టు

అంతకుముందు గురువారం (మార్చి 28), మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. ఆరు రోజుల ఈడీ కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనాన్ని నిరాకరించింది. అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ ఆయన చేసిన పిటిషన్‌పై మాత్రమే నోటీసు జారీ చేసింది.

Tags:    

Similar News