ఒడిశాలో ( Odisha ) 'రజా పర్బా' ( Raja Parba ) వేడుకల సందడి కనిపిస్తోంది. వానలు పడే ఈ వేళను భూమాతకు రుతుస్రావం జరుగుతుందనే అర్థంలో పండుగలా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజులపాటు మహిళలను దేవతల్లా అక్కడి ప్రజలు ఆరాధిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఇంటా సరదాగా గడుపుతారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. జూన్ రెండో వారం దాటిన తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి తొలకరి జల్లులు కురుస్తాయి. అప్పటివరకు ఎండిన నేల తేమగా మారుతుంది. పంటలు వేయడానికి సిద్ధమవుతుంది. ఈ పండగ మూడు రోజులు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు.
తెలంగాణ, ఆంధ్రలో సంక్రాంతి, బతుకమ్మ పండగల వాతావరణం ఒడిషాలో ఈ పండుగలో కనిపిస్తుంది.