Chandrababu Naidu : ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టంగా ఏర్పాట్లు
పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్ అధికారులు;
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ శనివారం సమీక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎ.బాబు, హరి జవహర్‌లాల్, కన్నబాబు, హరికిరణ్, వీరపాండ్యన్‌లకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) సురేష్‌కుమార్‌కు రిపోర్టు చేయాలని ఈ అధికారులను ఆదేశించింది.