AP: అమరావతిపై మాటమార్చిన జగన్..!

Update: 2023-07-09 10:59 GMT


ఏపీకి ఏకైక రాజధాని అమరావతి. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. రాష్ట్ర రాజధాని అమరావతికి జై కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీకి రాజధానిగా అమరావతినే అంటూ మద్దతు తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక అన్నింటా లాగే.. రాజధానిపై మాట తప్పి మడమ తిప్పేశారు. అంతే.. అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రైతులు, మహిళలు ఐక్యంగా జగన్ సర్కారుపై ఉద్యమ భేరి మోగించారు. ఎండనక, వాననక.. అలుపెరుగని పోరాటాన్ని సాగించారు. వైసీపీ ప్రభుత్వ దమనకాండ ప్రయోగించినా అడుగులు వెనక్కి పడలేదు. పోలీసులు ఖాకీలు ఝలిపించినా బెదరలేదు. ముళ్ల కంచెలు వేసి, నిర్బంధించి, లాఠీలతో కొట్టినా... అసెంబ్లీ గేటును తాకి అమరావతి రైతుల ఉద్యమ సత్తా ఏంటో చాటారు.

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేపట్టిన అమరావతి మహోద్యమం ఇవాళ 13 వందల రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు, మహిళలు మరోసారి గర్జించారు. నాలుగేళ్ల నరకంలో నవనగరం పేరుతో మందడంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. 29 గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ఈ రాజధాని రైతుల ఆందోళనకు టీడీపీ నాయకులు, రైతు సంఘాల నేతలు మద్దతు తెలిపారు.

ఏపీ రాజధాని అమరావతిపై జగన్ అనుసరిస్తున్న వైఖరిపై మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారని నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు.

1300 రోజులుగా రైతులు మహోద్యమం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య ఫైర్ అయ్యారు. నాలుగేళ్ల నరక పాలనలో ఏపీ ప్రజలే కాదు అమరావతి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కొన్ని నెలల్లోనే రాష్ట్రానికి, అమరావతికి పట్టిన పీడ వదిలిపోతుందన్నారు. భవిష్యత్తులో అమరావతి అజరామరంగా నిలుస్తుందని బాలకోటయ్య ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News