Maldives President: భారత పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
నేడు భారత ప్రధాని మోడీతో ముయిజ్జూ భేటీ..;
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం భారతదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ ఆయన వెంట ఉన్నారు. నాలుగు నెలల్లో ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి అయినా, తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. జూన్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్టోబరు 10 దాకా కొనసాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ముయిజ్జు సమావేశమవుతారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకు తోడు ఉభయులకూ ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై వీరి మధ్య చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ముంబయి, బెంగళూరు నగరాల్లో జరిగే వ్యాపార కార్యకలాపాలకు ముయిజ్జు హాజరవుతారు. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు భారత్‌కు కీలకమైన పొరుగు దేశం. ప్రధాని మోదీ దృక్పథమైన ‘సాగర్’ (ప్రాంతీయంగా అందరికీ భద్రత, అభివృద్ధి) విధానంలో దీనికి ప్రత్యేస్థానం ఉంది’’ అని పేర్కొంది.