ACA: ఆంధ్ర క్రికెట్‌కు కొత్త శకం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో కొత్త శకం.. ఏసీఏ నూతన ప్రధాన కోచ్‌గా గ్యారీ స్టేడ్.. స్టేడ్కు అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో స్థాయిని కోల్పోతున్న ఆంధ్ర జట్టుకు మంచి రోజులు వచ్చాయి. వచ్చే దేశవాళి సీజన్ నుంచి ఆంధ్రా జట్టుకు న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ మార్గనిర్దేశనం చేయనున్నాడు. ఈ నిర్ణయం అభిమానుల్లో కొత్త ఆశలు నింపింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. స్టీడ్‌ను సంప్రదించిన వెంటనే ఆయన కోచింగ్ బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించారని ఏసీఏ తెలిపింది. జట్టును బలోపేతం చేయాలన్న దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సెక్రటరీ సనా సతీశ్ బాబు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ కోచ్‌లలో ఒకరైన గ్యారీ స్టేడ్ ఆంధ్ర క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
గ్యారీ స్టేడ్ విజయ ప్రస్థానం
గ్యారీ స్టేడ్ అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు. ఆయన న్యూజిలాండ్ జాతీయ జట్టుకు కోచ్‌గా పనిచేసి ఆ జట్టుతో అద్భుతమైన విజయాలను సాధించారు. గ్యారీ స్టేడ్ కోచింగ్‌లో న్యూజిలాండ్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకుని ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అంతే కాకుండా అనేక ఐసీసీ టోర్నమెంట్లలో ముఖ్యంగా ప్రపంచ కప్‌లలో రన్నరప్‌గా నిలిచి నిలకడైన ప్రదర్శనను కనబరిచింది. ఈ విజయాలు గ్యారీ స్టేడ్ వ్యూహాత్మక నైపుణ్యం, ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపే సామర్థ్యం, ఆధునిక క్రికెట్ పట్ల ఆయనకున్న లోతైన అవగాహనను స్పష్టంగా సూచిస్తాయి.
స్వాగతించిన నారా లోకేశ్
గ్యారీ స్టేడ్ రాకతో క్రికెట్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం, మార్గదర్శకత్వం రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు సరికొత్త శిక్షణను అందస్తాయి. "ఆయన నైపుణ్యం మన యువతను ప్రోత్సహిస్తుంది, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రతిష్ఠను పెంచుతుంది. మన క్రికెట్ ఆశలను ప్రపంచ స్థాయిలో నిలబెడుతుంది" అని లోకేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నియామకం కేవలం ఒక కోచ్ మార్పు మాత్రమే కాదు.. ఆంధ్ర క్రికెట్‌కు ఒక కొత్త దిశానిర్దేశం. గ్యారీ స్టేడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర జట్టు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదిగే అవకాశం ఉంది. గ్యారీ స్టేడ్ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ క్రికెట్‌కు ఓ ముఖ్యమైన ముందడుగు అవుతుందని లోకేష్ పేర్కొన్నారు.
నిరాశ కలిగిస్తున్న జట్టు
ఒకప్పుడు దేశవాళీలో పోటీ ఇచ్చిన ఆంధ్ర జట్టు రెండు సంవత్సరాలుగా నిరాశ కలిగిస్తోంది. 2022-23 సీజన్లో రంజీ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా, అక్కడే ఆగిపోయింది. తర్వాతి రెండు సీజన్లలో నాకౌట్ దశకు కూడా అర్హత సాధించలేకపోయింది. రికీ భూయ్, శ్రీకర్ భరత్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు మెరుగైన వ్యక్తిగత ప్రదర్శనలు కనబరుస్తున్నారు. కానీ జట్టు సమిష్టితత్వం లోపించడం పెద్ద సమస్యగా మారింది. నిర్ణాయక మ్యాచ్‌లలో జట్టు నిలబడలేకపోయింది.స్టీడ్ రాకతో ఆంధ్ర జట్టు మారుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.