Rice-Arsenal: వెస్ట్‌హాం ప్లేయర్ రైస్‌ని దక్కించుకున్న ఆర్సెనల్ క్లబ్
ఆర్సెనల్ క్లబ్ ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల్లో ఇదే అతి పెద్దది;
వెస్ట్‌హాం(West Ham) జట్టు మిడ్ ఫీల్డర్, ఇంగ్లాండ్ జాతీయ జట్టు ఆటగాడు డెక్లాన్ రైస్(Declan Rice)ను ఆర్సెనల్(Arsenal) క్లబ్ రికార్డు ధరకి ఒప్పందం చేసుకుంది. ఇరు క్లబ్‌లు ఒప్పందం విలువపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 137.45 మిలియనన్ డాలర్ల(105 మిలియన్ పౌండ్లు)కు ఒప్పందం కుదిరిందని బ్రిటిష్ మీడియా వెల్లడించింది. దీంతో 2021లో ఆస్టన్ విల్లా ప్లేయర్ జాక్ గ్రాలిష్‌కి మాంచెస్టర్ సిటీ క్లబ్ చెల్లించిన 100 మిలియన్ పౌండ్లను ఈ డీల్ అధిగమించింది. ఆర్సెనల్ క్లబ్ ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల్లో ఇదే అతి పెద్దది. ఇంతకు ముందు 2019లో నికోలస్ పీప్ కోసం 72 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టింది.
"రైస్ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. చాలా రోజులుగా జాతీయ జట్టుకు, ప్రీమియర్ లీగ్‌లో ఉన్నతంగా రాణిస్తున్నాడు. అతని ప్రతిభపై మాకు నమ్మకం ఉంది. అతను మా క్లబ్ తరఫున కూడా రానిస్తాడు " అని ఆర్సెనల్ క్లబ్ ట్వీట్ చేసింది.
రైస్ వెస్ట్ హాం తరపున ఆడుతూ తన జట్టుకు అర్ధ శతాబ్ధం తర్వాత ఒక మేజర్ ట్రోఫీ యూరోపా కాన్ఫరెన్స్ లీగ్ టైటిల్ అందించాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా, లీగ్ ఉత్తమ ప్లేయర్‌గానూ నిలిచాడు. ప్రీమియర్ లీగ్ టేబుల్‌లో 14వ స్థానంలో నిలిపాడు.
ఆర్సెనల్ క్లబ్‌ని ఇటీవల వీడిన క్సాకా ప్లేస్‌ని రైస్‌తో భర్తీ చేయాలని అనుకుంటోంది. ఈ ఒప్పందంతో జట్టుకు అదనపు బలం చేకూరనుంది. ఆర్సెనల్ గత సీజన్‌లో అద్భుతంగా ఆడి రెండవ స్థానంలో నిలవడమే కాకుండా, 2016-17 తర్వాత ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్‌లో ఆడనుంది.