ASIA CUP: అభిషేక్ రాకింగ్...పాక్ షేకింగ్
పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన టీమిండియా... తొలుత బ్యాటింగ్ చేసి 171 రన్స్ చేసిన పాక్.. సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించిన భారత్
ఆసియాలో నెం.1 టీమ్ గా మరోసారి ఇండియా తన స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించింది. ఆసియాకప్ లో వరుసగా నాలుగో విక్టరీ సాధించింది. దాయాదుల పోరులో విజయం మళ్లీ భారత్ నే వరించింది. ఈసారి కాస్త ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 6 వికెట్లతో ఇండియా సునాయస విజయాన్ని సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ సూపర్-4 లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ (58) స్టన్నింగ్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో శివమ్ దూబేకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి .. మరో 7 బంతులు మిగిలి ఉండగానే, భారత్ ఈజీ విక్టరీ సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ ఫిఫ్టీ (39 బంతుల్లో 74, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలర్లలో హరీస్ రౌఫ్ కు రెండు వికెట్లు దక్కాయి.
పర్వాలేదనిపించిన పాక్
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్‌కు హార్దిక్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. పాండ్య బౌలింగ్‌లో ఫకార్ జమాన్ (15) శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన అయూబ్ (21)తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో శివమ్ దూబె బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అయూబ్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తలత్ (10) సైతం వెనుదిరిగాడు. ఫర్హాన్ మాత్రం నిలకడగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నవాజ్ (21) రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో సల్మాన్ (17*), అష్రఫ్ (20*) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ మంచి స్కోరే చేసింది. దూబె 2 వికెట్లు.. హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
అభిషేక్- గిల్ ఊచకోత..
కాస్త చాలెంజింగ్ టోటల్ ను ఛేజ్ చేయడంలో భారత్ కు ఓపెనర్లు అభిషేక్, శుభమాన్ గిల్ (47) చక్కని ఆరంభాన్ని అందించారు. ఇద్దరు ఒకరితోఒకరు పోటీపడుతున్నట్లుగా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా శర్మత్ తోపాటు గిల్ పోటీపడి, పరుగులు సాధించాడు. దీంతో 4.4 ఓవర్లలోనే ఫిఫ్టీ పరుగుల మార్కును దాటింది. ఈ జోరులోనే 24 బంతుల్లో అభిషేక్ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో గిల్ కూడా బ్యాట్ ఝళిపించడంతో 8.4 ఓవర్లలో భారత వంద పరుగుల మార్కును దాటింది. అయితే ఫిఫ్టీకి చేరువలో ఉండగా, క్రాంప్స్ రావడంతో గిల్ జోరు తగ్గింది. ఆ తరవాత బంతికే తను ఔటయ్యాడు. దీంతో 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరూ పదికిపైగా రన్ రేట్ తో పరుగులు సాధించడం విశేషం. ఆ తర్వాత కాసేపటికే సూర్య కుమార్ యాదవ్ డకౌటయ్యాడు. మరో ఎండ్ లో సిక్సర్లతో జోరు చూపించిన అభిషేక్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ దశలో కాస్త ఉత్కంఠ నెలకొన్నా, తిలక్ వర్మ (34 నాటౌట్), వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్ (13) సమయోచితంగా బ్యాటింగ్ చేశారు.