ఆసియా కప్ 2025 టోర్నీలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ లిటన్ దాస్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ యసిమ్ ముర్తాజా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) మెరుగైన ప్రదర్శన చేశాడు. ఓపెనర్ జీషన్ అలీ(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30), నిజకత్ ఖాన్(40 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 42) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, రిషద్ హొస్సేన్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 144 పరుగులు చేసి గెలుపొందింది. లిటన్దాస్కు తోడుగా టౌహిడ్ హృదయ్(36 బంతుల్లో ఫోర్‌తో 35 నాటౌట్) రాణించాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో అయుష్ శుక్లా, అతీక్ ఇక్బాల్ చెరో వికెట్ తీసారు. లక్ష్యచేధనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు పర్వేజ్ హోస్సేన్(19), తంజిద్ హసన్(14) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ లిటన్ దాస్, టౌహిడ్ హృదయ్ ఆచితూచి ఆడారు. 44 బంతుల్లో లిటన్ దాస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హాంకాంగ్.. సూపర్-4 రేసు నుంచి తప్పుకుంది.