బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్టులు, 2024లో టీ20లకు గుడ్ బై పలికారు. ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకున్నారు. బంగ్లా తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు చేశారు. 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
తన క్రికెట్ కెరీర్‌లో తన కుటుంబ మద్దతు ఎంతో కీలకమని, ముఖ్యంగా తన భార్య, పిల్లలు తనకు గట్టి తోడుగా నిలిచారని మహ్మదుల్లా తెలిపారు. “నా భార్య, నా పిల్లలు నాకు గొప్ప మద్దతు వ్యవస్థగా నిలిచారు” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తన కుమారుడు రయీద్, తనను బంగ్లాదేశ్ జట్టులో ఆడటం మిస్ అవుతాడని చెప్పాడు.
బంగ్లాదేశ్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా మహ్మదుల్లా నిలిచాడు. ప్రపంచకప్‌ల్లో మూడు సెంచరీలు చేసిన ఏకైక బంగ్లా బ్యాట్స్ మ్యాన్ గా ఘనత సాధించాడు. ముఖ్యంగా, 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. ఆ సీజన్‌లో బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 2023 ప్రపంచకప్‌లోనూ మరో శతకం నమోదు చేశాడు.