BCCI: ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేసిన భారత్?
ఆసియా కప్ మెగా టోర్నీ నుంచి వైదొలగాలని టీమిండియా నిర్ణయం;
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ మెగా టోర్నీ నుంచి వైదొలగాలని టీమిండియా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లతో భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో శ్రీలంకలో జరగాల్సిన మహిళల ఎమర్జింగ్ టీం ఏషియా కప్, సెప్టెంబర్‌లో జరగాల్సిన పురుషుల ఏషియా కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ఏషియా క్రికెట్ కౌన్సిల్ కి బీసీసీఐ తెలియజేసింది. తమ నిర్ణయాన్ని ఏషియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలియజేస్తూ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏసీసీకి పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నక్వి నేతృత్వం వహిస్తున్నారు. అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు గానూ కొనసాగుతున్నారు. దాంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దౌత్య పరంగా పాకిస్తాన్‌ను ఒంటి చేయాలని చూస్తున్న భారత్.. అటు క్రికెట్‌లోనూ దాయాదిని ఒంటరి చేసి, ఇరుకున పెట్టాలని చూస్తోందని బోర్డు వర్గాలు తెలిపాయి. "పాకిస్తాన్ మంత్రి నేతృత్వంలోని ఏషియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్‌లో భారత జట్టు పాల్గొనదు. ఇది దేశం కోసం తీసుకున్న నిర్ణయం. మహిళల ఎమర్జింగ్ టీం ఏషియా కప్ నుండి తప్పుకుంటున్నట్లు వారు నోటిఫికేషన్ ఇచ్చారు. మేం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆటగాళ్ల భద్రతతో పాటు జాతీయత, దేశ సమగ్రత ముఖ్యమని" అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
వాయిదా పడుతుందా..?
ఈ ఏడాది సెప్టెంబర్‌లో పురుషుల ఏషియా కప్ 2025 జరగాల్సి ఉంది. దీనికి భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పాల్గొనే ఈ టోర్నమెంట్ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ పాల్గొనే మెగా టోర్నీలపై బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకోనుంది. భారతదేశం లేకుండా ఏషియా కప్ నిర్వహించడం సాధ్యం కాదని పాక్ క్రికెట్ బోర్డుకు కూడా తెలుసు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లలో భారత్ పాల్గొంటేనే కాసుల వర్షం కురుస్తుంది. అటువంటిది భారత్ లాంటి దేశం ఏషియా కప్ ఆడకపోతే పాక్ మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లేకుంటే ఏషియా కప్‌పై ప్రసారహక్కులకు ఎవరూ ముందుకు రారు. ఈ టోర్నమెంట్ ఈ ఎడిషన్ జరగకపోతే, ఒప్పందంలో కొన్ని మార్పులు జరగవచ్చు.