వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
ఈ ఏడాది చివరలో వన్డే ప్రపంచకప్ సంగ్రామం జరగనుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.;
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహా పండుగ వచ్చేస్తోంది. ఈ ఏడాది చివరలో వన్డే ప్రపంచకప్ సంగ్రామం జరగనుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచకప్ ఆడే మిగిలిన దేశాలకు షెడ్యూల్‌ను పంపించి వారి ఆమోదం తర్వాత అధికారికంగా ఐసీసీ వెల్లడించనుంది.
బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్‌లో జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్ తలపడనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ వన్డే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత్ జట్టు వన్డే ప్రపంచకప్ 2023లోని తమ లీగ్ మ్యాచ్‌లను మొత్తం 9 నగరాల్లో ఆడనుంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం 5 నగరాల్లో తన లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ కోసం వేదికలు ఖరారు అయినా.. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్ వేదికలను మాత్రం ఖరారు చేయలేదు.