BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా
తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా... సెప్టెంబర్లో బీసీసీఐ వార్షిక సదస్సు.. ఆ సదస్సులోనే కొత్త బీసీసీఐ బాస్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాత్కాలిక బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జరిగిన అపెక్స్ కౌన్సెల్ సమావేశంలో కొత్త స్పాన్సర్ కోసం అన్వేషణ, త్వరలో జరగనున్న ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ తర్వాత రోజర్ బిన్నీ రాజీనామా చేశారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు. రోజర్ బిన్నీ ఈ ఏడాది జులై 19న తన 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవిలో కొనసాగే అర్హతను కోల్పోయారు. అయితే తాజాగా ‘నేషనల్ స్పోర్ట్స్ బిల్’ పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచారు. అయినా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రోజర్ బిన్నీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ
బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.
తనదైన ముద్ర వేసిన బిన్నీ
రోజర్ బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. గంగూలీ తన మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా.. బిన్నీ ఒక్కడే పదవికి పోటీపడ్డారు. బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడైన తర్వాత.. భారత్ రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకుంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. చారిత్రాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా బిన్నీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశీయ క్రికెట్కు ప్రాధాన్యం లభించింది. ఆటగాళ్ల జీతకాలు సైతం పెరిగాయి. టీమిండియా సీనియర్లు సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడేలా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది.