ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దోపిడీ జరిగింది. ఈనెల 17న విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అందులోనూ కొన్ని వస్తువుల ఫొటోలను షేర్ చేస్తూ.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరాడు. కాగా, దోపిడీ జరిగిన సమయంలో తాను పాకిస్థాన్ పర్యటనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. తన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. వారికి ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించాడు.చోరీకి గురైన కొన్ని వస్తువుల ఫొటోలను బెన్‌స్టోక్స్ షేర్ చేశాడు. అందులో నగలు ఉన్నాయి. డిజైనర్ బ్యాగ్, క్రికెట్‌కు అందించిన సేవలకు గౌరవార్థంగా ఇచ్చిన మెడల్ తస్కరణకు గురైనట్లు పేర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ నెగ్గడంలో బెన్‌స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ‘‘చాలా వస్తువులను కోల్పోయా. వాటికి విలువ కట్టలేను. ఇప్పుడు ఫొటోలను షేర్ చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ఎవరికైనా దొరికితే అందిస్తారనే ఆశతో చేస్తున్నా’’ అని బెన్ స్టోక్స్ తెలిపాడు.