Mohammed Shami: రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ?
బీజేపీ నుంచి పోటీ !;
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సు ఉంది. బెంగాల్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో షమీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ ఎంట్రీపై ఇప్పటి వరకు షమీ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. కానీ బెంగాల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయపడ్డ షమీ .. సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. స్పీడ్‌గా కోలుకోవాలని ప్రధాని మోదీ అతనికి విషెస్ కూడా చెప్పారు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీశాడతను.
ఇటీవలే షమీ గురించి మోదీ ట్వీట్
చీలమండ గాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉన్న భారత పేసర్ మహమ్మద్ షమీ తనకు లండన్‌లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని షమీ చెప్పాడు. అయితే ఈ విషయంపై ప్రధానిస్పందించారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ ఆకాంక్షించారు. షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు.
గత నవంబరులో ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడాడు షమ్మీ. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చారు. జనవరి చివరి వారంలో లండన్‌లో కొన్ని చీలమండ ఇంజెక్షన్లు తీసుకున్న షమి తేలికపాటి పరుగులు సాధన చేశాడు. అయితే 3 వారాల తర్వాత ఇంజెక్షన్ల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో నొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఇక శస్త్రచికిత్స మినహా మరే మార్గంలేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. నొప్పితోనే ప్రపంచకప్ ఆడిన షమి ఆ ప్రభావం మ్యాచ్‌లపై పడనివ్వలేదని సమాచారం..