BOPANNA:భారత టెన్నీస్ చరిత్రలో ముగిసిన శకం
ప్రొఫెషనల్ కెరీర్‌కు బోపన్న వీడ్కోలు.. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు స్టార్ గుడ్ బై
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుదీర్ఘమైన కెరీర్లో తనకు సహకరించిన వాళ్లందరికీ, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. భారత టెన్నిస్‌లో సుదీర్ఘకాలం పాటు అగ్రగామిగా నిలిచిన రోహన్ బోపన్న, రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుతమైన కెరీర్‌కు తెరదించుతూ, ప్రొఫెషనల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. పారిస్ మాస్టర్స్ 1000 టోర్నమెంట్ బోపన్న కెరీర్లో చివరిది కావడం గమనార్హం. 2002లో అరంగేట్రం చేసిన బోపన్న దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌లో అనేక టోర్నమెంట్‌ల్లో ఆడాడు. కాగా, 45ఏళ్ల బోపన్న భారత్ తరఫున గతేడాదే తరఫున రిటైర్మెంట్ ప్రకటించినా, ఇప్పటిదాకా ప్రొఫెషనల్ గ్రాండ్‌స్లామ్ అలాగే ATP టోర్నీల్లో కొనసాగాడు. ఇకపై టెన్నిస్‌కు సంబంధించి ఏ టోర్నీలోనూ బోపన్న బరిలో దిగడు. తన ట్రేడ్‌మార్క్ సర్వ్, అద్భుత నెట్ ప్లేతో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
బోపన్న రికార్డులు
బోపన్న తన కెరీర్లో ఇప్పటి వరకూ 26 డబుల్స్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను కూడా అందుకున్నాడు. దీంతో పాటు డబుల్స్‌లో నెం.1 ర్యాంక్ సాధించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్‌గానూ చరిత్రకెక్కాడు. 2018 ఆసియా గేమ్స్‌లో బోపన్న- దివిజ్ జోడీ పురుషుల డబుల్స్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. 2022 ఆసియా గేమ్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లోనూ బోపన్న పసిడి దక్కించుకున్నాడు. 2010, 2023లో యూఎస్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్ వరకూ చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మూడుసార్లు (2013, 2015, 2023), ఫ్రెంచ్ ఓపెన్‌లో (2022, 2024) రెండుసార్లు డబుల్స్ సెమీస్‌కు అర్హత సాధించాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లోనూ బోపన్న భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
‘పల్లెల్లోని ప్రతిభావంతులైన యువతకు స్ఫూర్తి నింపడమే నా తర్వాతి లక్ష్యం. ఎంత ఎదిగినా మన మూలాలను మరవద్దు. ఎక్కడ మొదలు పెట్టామని కాదు.. మన అనుభవం ఎంత వరకు విస్తరిస్తుందనే దానిపై పరిమితులను మనమే నిర్ణయించుకోవాలి. నమ్మకం, కష్టపడి పని చేయడం, అభిరుచి.. ఇవి ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు దానికి నేను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇది గుడ్‌బై కాదు. నన్ను తీర్చిదిద్దిన, నమ్మిన, నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందరూ నా ప్రయాణంలో భాగం.. నాలో భాగం’ అని బోపన్న రాసుకొచ్చారు.