Chess Olympiad 2024: రోహిత్‌ శర్మను అనుకరించిన చెస్‌ ఛాంపియన్స్

చెస్‌ ఒలింపియాడ్‌ 2024లో రెండు స్వర్ణాలు;

Update: 2024-09-24 07:00 GMT

ఈ ఏడాది వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకోవడానికి టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండు చేతులు లయబద్ధంగా ఊపుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చెస్‌ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచిన భారత పురుషుల, మహిళల జట్లు కూడా ఇలాగే సంబరాలు చేసుకున్నాయి. మన చెస్‌ ప్లేయర్లు జాతీయ పతాకాలు పట్టుకుని పోడియంపై నిలబడగా.. అటు నుంచి గుకేశ్, ఇటు నుంచి తానియా ట్రోఫీలు పట్టుకుని రోహిత్‌ లాగే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు. ట్రోఫీలను సహచర ప్లేయర్లకు అందించి కేరింతల్లో మునిగిపోయారు. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సి కూడా ఇలాగే సంబరాలు చేసుకున్నాడు. చైనా, ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ తర్వాత ఒకే చెస్‌ ఒలింపియాడ్‌లో మహిళలు, పురుషుల బంగారు పతకాలు గెలిచిన దేశంగా భారత్‌ నిలిచింది. మరోవైపు ఈ విజయంతో కల నిజమైందని గుకేశ్‌ తెలిపాడు.

‘‘ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా నాకు, జట్టుకు ఇదెంతో ప్రత్యేకమైన అనుభవం. కల నిజమైంది. ఫైనల్‌ రౌండ్‌ కంటే ముందే మేం సంబరాలకు సిద్ధమయ్యాం. ఆఖరి రౌండ్లో మేం ఒకవేళ ఓడినా మెరుగైన టేబ్రేక్‌ స్కోరుతో టైటిల్‌ గెలిచేవాళ్లం. కానీ ఆ మ్యాచ్‌నూ నెగ్గాలని నిర్ణయించుకున్నాం. నేను, అర్జున్‌ కలిసి పని పూర్తిచేశాం. 2022లో స్వర్ణం అందలేదు. ఈసారి వదలొద్దనుకున్నాం’’ అని అతను చెప్పాడు. ‘‘టోర్నీ మధ్యలో కొంచెం తడబడ్డా ఆ తర్వాత గొప్పగా పోరాడి స్వర్ణం గెలిచాం. భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. దేశం తరపున ఆడుతున్నప్పుడు ప్రతి గేమ్‌ గెలవాల్సిందే’’ అని మహిళలు పసిడి గెలవడంలో కీలక పాత్ర పోషించిన దివ్య దేశ్‌ముఖ్‌ పేర్కొంది.

Tags:    

Similar News