విశాఖ సాగర తీరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మరికొద్ది గంటల్లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి విశాఖ హోమ్ గ్రౌండ్‌గా ఈ ఏడాది వుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు రెండు నెలలు వ్యవధిలోనే విశాఖ క్రికెట్ స్టేడియాన్ని ఏసీఏ కొత్త హంగులతో తీర్చిదిద్దింది. స్టేడియంలో కొత్తగా వీక్షకుల కోసం 34 బాక్సులు ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల కోసం నూతనంగా 2 డ్రెస్సింగ్ రూమ్‌లను సిద్ధం చేశారు. స్టేడియంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ లైట్లతో మ్యాచ్‌లను వీక్షిస్తున్న ప్రేక్షకులకు గతంలో కంటే మెరుగైన దృశ్య అనుభూతి కలగనుంది. క్రికెట్ అభిమానులు సౌలభ్యం కోసం డిజిటల్ డిస్ ప్లే స్కోర్ బోర్డులు ఏర్పాటు చేశారు. విశాఖలో జరగనున్న 2 ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం రూ. 40 కోట్లతో వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు.
విశాఖలో జరిగే మ్యాచ్ ను AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సహా ఉత్తరాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు వీక్షించనున్నారు. ఐపీఎల్‌కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు, ప్రముఖుల రాకను దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ చివరి వరకు 1400 మంది పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించనున్నారు. జాతీయ రహదారి పక్కనే స్టేడియం ఉండటం వల్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. సాయంత్రం ఏడున్నరకు జరిగే మ్యాచ్ కోసం అటు విశాఖ వాసులు, క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. విశాఖ పిచ్‌ను బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. బ్యాటర్ల బాదుడును అడ్డుకోవడం ఇక్కడ కస్టమే నని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్, కెప్టెన్ అక్షర్ పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.