DHONI: ధోనీ నా కెరీర్ నాశనం చేశాడు
తొలిసారి ధోనీపై తీవ్ర విమర్శలు... ఇప్పటికే ధోనీపై సెహ్వాగ్ ఆరోపణలు... తాజాగా ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు;
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనను పక్కనపెట్టారని పరోక్షంగా ఆరోపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. ధోనీ కారణంగానే తన కెరీర్ నాశనమైందని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. మెరుగైన ప్రదర్శన చేసినా జట్టు నుంచి తప్పించాడని ఆరోపించాడు. జట్టులో ప్రధాన పేసర్‌గా.. పేస్ ఆల్‌రౌండర్‌గా వెలుగొందిన ఇర్ఫాన్ పఠాన్ 2009లో ఉన్నట్టుండి జట్టుకు దూరమయ్యాడు. భారత్ తరఫున చివరి మ్యాచ్‌ను ఇర్ఫాన్ పఠాన్ 2012 అక్టోబర్‌లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయిన అతను.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇర్ఫాన్ పఠాన్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా మారిన తర్వాత గంగూలీ కెప్టెన్సీలో ఆడిన సీనియర్ ప్లేయర్లను సైడ్ చేయడం మొదలెట్టాడు. సచిన్ టెండూల్కర్ మినహాయిస్తే, మిగిలిన సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా కెరీర్‌కి సరైన వీడ్కోలు లేకుండానే క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న వీరేంద్ర సెహ్వాగ్, 2007లోనే రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నాడట.. ‘‘2007-08 ఆస్ట్రేలియాలో వన్డే మ్యాచులు ఆడాం. అందులో నేను మొదటి మూడు మ్యాచులు ఆడాను. ఆ తర్వాత నన్ను, టీమ్ నుంచి తప్పించారు. ఆ తర్వాత నన్ను, తుది జట్టులోకి తీసుకోవడమే మానేశారు. ఇక నేను, టీమ్‌లోకి రాలేనేమోనని అనిపించింది. వన్డే క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, తప్పుకోవడమే బెటర్ అని అనుకున్నాను..
నా నిర్ణయాన్ని, తొలుత సచిన్ టెండూల్కర్‌కి చెప్పాను. వన్డేల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పాను. దానికి ఆయన, ‘వద్దు, అలా చేయకు.. 1999-2000 సమయంలో నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశాను. క్రికెట్ మానేయాలని అనిపించింది. అయితే కెరీర్లో ఇలాంటి ఫేజ్‌లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు నీ విషయంలో అదే జరుగుతోంది. ఇది పోతుంది. తొందరపడి, ఏ నిర్ణయాలు తీసుకోకు.. నీకు, నువ్వు కొంత సమయం ఇవ్వు.. ఇంకో ఒకటి, రెండు సిరీస్‌లు చూడు..’ అని చెప్పారు. ఆ తర్వాతి సిరీస్‌లో నేను ఆడాడు, బాగా పరుగులు చేశాను.. అని సెహ్వాగ్ అన్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపికయ్యాను, మేం వరల్డ్ కప్ కూడా గెలిచాం అని సెహ్వాగ్ అన్నాడు.