ENGLAND: ప్రత్యర్థి జట్లకు ఇంగ్లాండ్ బిగ్ వార్నింగ్
మరోస్థాయికి ఇంగ్లాండ్ బజ్‌బాల్ గేమ్... టీ20ల్లో 300కుపైగా పరుగులు చేసిన ఇంగ్లాండ్.. పొట్టి ప్రపంచకప్‌కు ముందు భారీ స్కోరు
టీ20ల్లో 300కు పైగా పరుగులు సాధ్యమేనా? కొన్నాళ్లుగా ఈ ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు, 300 మార్కుకి దగ్గరగా వచ్చినా అందుకోలేకపోయాయి. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 300+ స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్ జట్టు.. సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు... టెస్టు హోదా ఉన్న దేశాల్లో టీ20ల్లో 300+ స్కోరు బాదిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ కలిసి తొలి వికెట్‌కి 7.5 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులు చేసిన జోస్ బట్లర్, 8వ ఓవర్లో అవుట్ అయ్యాడు. జాకబ్ బెథల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. 305 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయిడిన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్ కలిసి 3.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
గత రికార్డులు ఇవీ
ఈ దెబ్బతో ఇంగ్లాండ్ టీ20ల్లో మూడో అత్యధిక స్కోర్ ను సాధించిన జట్టుగా రికార్డుకు ఎక్కింది. 2024లో జింబాబ్వే జట్టు గాంబియాపై 344 పరుగులతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత 2023లో నేపాల్ 314 పరుగులతో రెండో స్థానంలో ఉంది. కాకపోతే, టెస్టు దేశాలు అర్హత ఉన్న అత్యధిక టీ20 స్కోరు మాత్రం ఇదే. ఇక భారీ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను కేవలం 158 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 146 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులతో విజయం సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.
వన్డే చరిత్రలోనూ సంచలనం
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాను 342 పరుగుల తేడాతో ఓడించి రికార్డులు తిరగరాసింది ఇంగ్లాండ్. ఇది ODI క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఓ జట్టు సాధించిన అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 414 పరుగులు చేసింది. రికార్డు పరుగులను ఛేజింగ్ చేయడానికి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది. సఫారీ టీం కేవలం 72 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో 342 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో హయ్యెస్ట్ ఛేజింగ్ టీంగానే కాదు, వన్డేలో అతిపెద్ద ఓటమిని చవిచూసిన జట్టుగానూ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం ఇంగ్లాండ్ ఖాతాలోకి చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 342 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంకపై 317 పరుగుల తేడాతో నెగ్గిన టీం ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఇటు వన్డేల్లోనూ అటు టీ 20ల్లోనూ ఊచకోత కోస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు.. టీ 20 ప్రపంచక్ నకు ముందు ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇస్తున్నారు.