Football Player Pele: చెప్పులు లేని పేదరికం నుండి చరిత్రలో గొప్ప అథ్లెట్‌గా ఎదిగి.. ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే ప్రస్తానం..
Football Player Pele: పీలే ఫుట్‌బాల్ క్రీడాకారుడిగానే కాదు అత్యంత ప్రతిభావంతులైన అథ్లెట్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతని కీర్తి, ప్రతిష్టలు అందనంత ఎత్తులో ఉన్నా ఎప్పుడూ ఆ గర్వం కనిపించేది కాదు. అందుకే అతడిని ప్రపంచం మొత్తం కీర్తించింది.;
Football Player Pele: చెప్పులు లేని పేదరికం నుండి చరిత్రలో గొప్ప అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన లెజెండరీ బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నుమూశారు. ఆయన వయసు 82. ఫుట్‌బాల్ ఆటగాడు పీలే చికిత్స పొందుతున్న సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం 3:27 గంటలకు మరణించినట్లు తెలిపారు. ఆసుపత్రి నివేదిక ప్రకారం పీలే పెద్దప్రేగు క్యాన్సర్‌తో పోరాడి ప్రాణాలు విడిచారు.
పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాసిమెంటో. ఫుట్‌బాల్ మైదానంలో అతడి ఆట తీరు ఎందరో అభిమానులను కూడగట్టింది. క్రీడా ప్రియులు పీలేను జ్ఞాపకం చేసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఫుట్‌బాల్ క్రీడలో అతడొక గొప్ప ఆటగాడిగా కీర్తింపబడ్డాడు.
పీలే ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ దిగజారడంతో కుమార్తె కెలీ క్రిస్టినా డో నాసిమెంటో ఆసుపత్రిలో అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ నివాళిని పోస్ట్ చేసింది. "సమయం గడిచిపోతుంది... (కానీ) సంతోషకరమైన క్షణాలు శాశ్వతం," అని రాసుకొచ్చింది. చిత్రంలో పీలే అతని కుమార్తెలు కెలీ క్రిస్టినా, జెన్నిఫర్, ఫ్లావియా ఉన్నారు.
82 ఏళ్ల పీలే నవంబర్ 29 న శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. "సెప్టెంబర్ 2021లో పీలేకు పెద్దప్రేగు క్యాన్సర్ సోకింది. పీలే ఆరోగ్యం క్షీణించిందని, కీమోలు చేయించుకున్నా క్యాన్సర్ తిరగబెట్టిందని, ఇప్పుడు మరింత జాగ్రత్త అవసరమని ఆసుపత్రి వైద్యులు ఈ వారం ప్రారంభంలో నివేదించారు.
పీలే బ్రెజిల్‌లోని ట్రెస్ కొరాకోస్‌లో అక్టోబర్ 23, 1940న జన్మించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులలో పీలే ఒకరు. 1958, 1962 మరియు 1970లలో మూడు ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ పేరు మీద పీలే పేరు పెట్టారు.
పీలే పేదరికాన్ని చూశాడు. పీలే తండ్రికి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే పీలేకి తండ్రి ఫుట్‌బాల్ క్రీడలోని మెళకువలన్నీ నేర్పించాడు. కానీ ఆట ఆడేందుకు ఫుట్‌బాల్‌ను కొనుగోలు చేయలేని పేదరికం వారిది. దాంతో వారు కాగితంతో తయారు చేసిన బాల్‌తో ఆడేవారు.
పీలే స్థానిక టీ దుకాణాల్లో వెయిటర్‌గా కూడా పనిచేశాడు. పీలే తన యవ్వనంలో ఇండోర్ లీగ్‌లలో ఆడాడు. 16 సంవత్సరాల వయస్సులో బ్రెజిలియన్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పుడే బ్రెజిల్ నేషనల్ గేమ్స్ నుంచి పీలేకు పిలుపు వచ్చింది.
తర్వాత అతని ఫుట్‌బాల్ కెరీర్‌లో, పీలే ప్రొఫెషనల్ గేమ్‌లలో 1,000 గోల్స్‌కు పైగా చేశాడు. 19 నవంబర్ 1969న రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలోని వాస్కోడా గామాలో పీలే తన అద్భుతమైన 1000వ స్కోర్ చేశాడు. అంతర్జాతీయ గేమ్‌లలో పీలే స్ట్రైక్ రేట్ అత్యధికంగా ఉంది. 1977లో పీలే తన కెరీర్‌ను పూర్తి చేసి రిటైర్ అయ్యాడు.
వ్యక్తిగత జీవితం
బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. పీలే, 1970లలో, వామపక్ష రాజకీయ ఖైదీల పట్ల సానుభూతితో ఉన్నారనే అనుమానంతో అధికార బ్రెజిలియన్ ప్రభుత్వం అతనిని విచారించింది. పదవీ విరమణ చేసిన తర్వాత పీలే ఫుట్‌బాల్ క్రీడకు గొప్ప రాయబారిగా కొనసాగాడు.
పీలే 1992లో పర్యావరణం కోసం UN రాయబారిగా నియమితులయ్యారు. పీలే యునెస్కో గుడ్‌విల్ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యారు. పీలే ఫుట్‌బాల్ క్రీడాకారుడిగానే కాదు అత్యంత ప్రతిభావంతులైన అథ్లెట్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతని కీర్తి, ప్రతిష్టలు అందనంత ఎత్తులో ఉన్నా ఎప్పుడూ ఆ గర్వం కనిపించేది కాదు. అందుకే అతడిని ప్రపంచం మొత్తం కీర్తించింది.