టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అత్యుత్సాహం ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ కోల్పోయేలా చేసింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు చేసిన సూచనలు పట్టించుకోకుండా సేమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగిన గంభీర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసిస్తే.. భారత స్పిన్ ఆల్‌రౌండర్లు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. . శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోయాడు. ఇది కూడా భారత ఓటమికి కారణమైంది. గంభీర్ నిర్ణయాలు భారత్ కు శాపంగా మారాయి.
జడేజాపైనా అదే అక్కసు
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టేందుకే అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ వేనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో టెస్ట్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసినా వన్డేలకు పరిగణలోకి తీసుకోలేదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేశారు. ఈ ఇద్దరికీ తొలి రెండు వన్డేల్లో అవకాశం కల్పించారు. అక్షర్ పటేల్‌ను నెంబర్ 5 బ్యాటర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. రెండు మ్యాచ్‌ల్లో అతను విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో మ్యాచ్‌లో 44 పరుగులు చేసాడు. వాషింగ్టన్ సుందర్ రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. బౌలింగ్‌లో జడేజా తరహాలోనే రాణిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగా.. ఆ టోర్నీ ఆడే సత్తా జడేజాకు ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలోనే జడేజాను పక్కనపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఒక్క తప్పుతోనే ఓడిపోయాం: గిల్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే కీలక క్యాచ్‌లు వదిలేయడంతోనే ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం అధికార బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. టాస్ ఓడిపోవడం పెద్దగా ప్రభావం చూపలేదన్నాడు.