Harmanpreet Kaur: ఆరేళ్లయినా ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు!

ప్రపంచకప్‌లో హర్మన్‌ అరుదైన రికార్డు;

Update: 2024-09-17 06:15 GMT

అక్టోబర్‌ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవని భారత్.. ఈసారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా కప్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పేరిట టీ20 ప్రపంచకప్‌లో ఉన్న ఓ రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ కొనసాగుతున్నారు. ఆరేళ్లయినా ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు.

టీ20 ప్రపంచకప్‌ 2018లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ న్యూజిలాండ్‌పై సెంచరీ చేసింది. గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుంది. మొత్తంగా 51 బంతుల్లో 103 పరుగులు చేసింది. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. హర్మన్‌ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏ భారత మహిళా క్రికెటర్‌ కూడా సెంచరీ చేయలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 2023లో ఐర్లాండ్‌పై 87 పరుగులు, 2018లో ఆస్ట్రేలియాపై 93 రన్స్ చేసింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ల్లో హర్మన్‌ 35 మ్యాచ్‌ల్లో 576 పరుగులు చేసింది. ఎక్కువ సిక్స్‌లు కొట్టిన భారత మహిళా క్రికెటర్‌గానూ ఆమె కొనసాగుతోంది.

భారత మహిళా జట్టు టీ20 ప్రపంచకప్‌ను ఒక్కసారి కూడా గెలవలేదు. 2020లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో భారత్ ఫైనల్ చేరి.. రన్నరప్‌గా నిలిచింది. 2018, 2023లో సెమీస్‌కు చేరింది. 2024 ప్రపంచకప్‌లో అయినా భారత్‌ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్టోబర్‌ 4న దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను భారత్‌ ఢీకొట్టనుంది. ఈ ఏడాది భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News